సరైన దారి.. ఈ సర్దారి. మన్మోహన్ జీ కి అక్షర నివాళి

ఆర్థిక శాస్త్రంలో చదువు.. అదే అస్త్రంగా కొలువు.. పాగా పెట్టిన బుర్ర నిండా లెక్కల బరువు.. భారత ఉన్నతికి కల్పతరువు *_మన సింగు..నిజాయితీ కింగు రాజకీయం ఆయన వృత్తీ కాదు.. ప్రవృత్తీ కాదు.. నిజానికి అది ఆయనకు చేదు.. అలాగని మిన్నకుంటే ఊరుకుంటాడా అపర చాణక్యుడు పివి.. ఏరి కోరి తన కొలువులో అప్పగిస్తే ఆర్థిక శాఖ.. సంస్కరణల మాయాజాలం.. మన్మోహనుడి సమ్మోహనాస్త్రం.. ఆనాడు మన ప్రగతి చూసి నివ్వెరపోయింది ఆర్థికశాస్త్రం! తిమ్మిని బమ్మిని చెయ్యలేదు బ్రహ్మాండం మాత్రం బద్దలు చేసేసాడు..సింగు.. సంపద సృష్టి.. ఉపాధి కుంభవృష్టి.. మన ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి.. నరసింహుడికి ఇష్టకామేష్టి.. మన్మోహనుడికి దిష్టి. (ఆర్థిక మంత్రిగా అద్భుతాలు చేసినా ప్రధానిగా ఆయన పాత్రను..యాత్రను గురించి ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదు..) ఏది ఎలా ఉన్నా ఉన్నత విలువల సర్దార్ జీ. భారత రాజకీయాల్లో సదా గౌరవప్రదమైన సర్ జీ..

సరైన దారి..      ఈ సర్దారి.     మన్మోహన్ జీ కి    అక్షర నివాళి

ఒక శకం ముగిసింది  

నీతి చిన్నబోయింది..

తన ప్రతిరూపం 

అంతరించిపోయిందని..

నిజాయితీ అనుకుంది..

రాజకీయాల్లో ఇలాంటి

మనిషిని మళ్ళీ 

చూడగలుగుతానా అని..

విస్తుపోయింది అవని..

భారత దేశ ధృవతార

ఇలా అకస్మాత్తుగా

మరలిపోయిందేమని

 మన్మోహన్ సింగ్ ఇక లేరు

రాత్రి పడుకోబోయే ముందు

పిడుగు లాంటి వార్త..

నిండైన ఆ రూపం..

మొహంలో అణువణువునా

కనిపించే విజ్ఞానం..

చురుకైన కళ్ళు..

నడకలో హుందాతనం..

నడతలో నిజాయితీ..

ఒక్కసారి కళ్ల ముందు

1991..96 మధ్య రీళ్ళు

గిర్రున తిరిగాయి..

భారత ఆర్థిక వ్యవస్థ

ఎలా గాడిలో పడి 

కొత్త పరుగులు నేర్చిందో

ఆ దృశ్యాలు చకచకా

బుర్రలో మెదిలాయి

 ఒక్క మనిషి.

ఆ మనిషిని రాజకీయాల్లోకి

తెచ్చిన పెద్దమనిషి

ఆ ద్వయం సాధించిన అద్భుతం..

పరిస్థితే మారిపోయింది

ఆసాంతం

సర్దార్జీ

ప్రతి భారతీయుడు

మిమ్మల్ని కొలుస్తూనే

ఉంటాడు జీవిత పర్యంతం

గొప్ప కీర్తి సదా మీ సొంతం

 మన్మోహన్ సింగ్

జీవితంలో ఎంత కూడబెట్టాడో

తెలియదు కాని..

ఆయన జీవితం మొత్తం లెక్కలే..

లెక్కలంటే

రెండ్రెళ్లు నాలుగు..

రెండు మూళ్ళు ఆరు..

లెక్కలు కాదు..

అక్కడితో సరిపోట్టుకుంటే

ఆయన మన్మోహన్ సింగ్

ఎందుకవుతారు..

ఈ సింగ్

ఆర్థిక మంత్రిత్వంలో 

దేశం అంతగా 

ఎందుకు

స్వింగ్ అవుతుంది

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow