వివాహ వార్షికోత్సవ వేడుకల్లో మీడియాతో మాట్లాడిన వాసుపల్లి
కూటమి హామీలన్నీ అబద్ధాలే.. గద్దెనెక్కడం కోసం గడ్డి తిన్నారు. జగనన్న నేతృత్వంలో దక్షిణాన్ని అభివృద్ధి చేశాం - ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న ప్రజలు వాసుపల్లి దంపతులకు శుభాకాంక్షలు వెల్లువ. ఎన్నికల మందు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేక డెక్ అవుట్ అయిందని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు. వివాహ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన ఆశీలమెట్ట వైసిపి కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ముందుగా వాసుపల్లి గణేష్ కుమార్, ఉషారాణి దంపతులు అల్లిపురం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి స్వహస్తాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక వైసీపీ నేతలు, కార్పొరేటర్లు, ఆలయ కమిటీ కమిటీ మాజీ చైర్మన్ లు, కళాశాలల సిబ్బంది సారథ్యంలో వివాహ వార్షికోత్సవ కేక్ కటింగ్ చేసి, గజమాలలతో పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా దంపతులను సత్కరించారు. తనపై అభిమానం కురిపించిన శ్రేయోభిలాషులకు కళాశాల సిబ్బందికి వైసిపి నేతలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ను కారు చౌకగా అమ్ముతుంటే అడ్డుకోలేని కూటమి నేతలు సిగ్గుపడాలన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కేంద్ర నిర్ణయాన్ని తిరస్కరిస్తూ అసమ్మతి ప్రకటించారన్నారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో చారిత్రాత్మకమైన కట్టడాలు కలిగిన దక్షిణ నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. అబద్దాల మాటలతో ప్రచారం చేసి, ఈ వాసుపల్లి గణేష్ కుమార్ అభివృద్ధి పేరుతో దుకాణాలు ఇల్లులు ఖాళీ చేయిస్తారని పేదలకు తప్పుడు ప్రచారం చేసి అధికారం కోసం గడ్డి తిన్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ప్రజలకు కనబడటం లేదని విమర్శించారు. జగదాంబ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు ఎంత విశాలమైన రోడ్లు విస్తరించామని, జంక్షన్లో నిర్మించిన క్లాక్ టవర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద విశాఖగా మారిందన్నారు. అలాగే పూర్ణ మార్కెట్ నుండి నేరుగా శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయానికి చేరుకునే విధంగా ఘాట్ ను నిర్మించామన్నారు. 14 కోట్లతో టౌన్ హాల్ నిర్మాణం, వైసీపీ సమక్షంలో నాడు చేపట్టిన కోట్లాది రూపాయలతో మత్స్య సంపద ఎగుమతులకు, దిగుమతులకు వీలుగా విశాఖజెట్టి ఆధునీకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. ప్రజలకు పదేళ్ల పాలనలో ఎప్పుడు వారితోనే ఉంటూ ప్రజా దర్బారుల ద్వారా అనేక సేవలు అందించామన్నారు. ప్రజల సమస్యలు గానీ అభివృద్ధి గానీ పట్టని స్థానిక ఎమ్మెల్యే కనిపించకపోవడంతో నేడు వైసీపీ ప్రభుత్వంలో వాసుపల్లి చేసిన సేవలు ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని అన్నారు. కాలం చాలా వేగంగా నడుస్తుందని, అలాగే మార్పులు కూడా వస్తాయన్నారు. 2027 జమలి ఎలక్షన్లో మళ్లీ అధికారంలోకి వస్తామని వాసుపల్లి గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఇప్పటికీ ఆప్యాయంగా ఆదుకుంటున్నారంటే జగనన్న అందించిన టైం టు టైం క్యాలెండర్ ద్వారా పథకాలు పేదలకు చేరవేశారన్నారు. జగనన్న సీఎంగా ఉండి ఉంటే అమ్మ ఒడి ఈ సంక్రాంతి పండుగలో 640 కోట్లు ప్రతి సంవత్సరం రూపాయి అవినీతి లేకుండా అందించే వారన్నారు. జగనన్నే సీఎంగా ఉండి ఉంటే ఆటో డ్రైవర్ల కార్మికుల నుండి అన్నదాతల వరకు పథకాలు చేరేవన్నారు. కానీ సూపర్ సిక్స్ పేరుతో అందలం ఎక్కిన కూటమి ఒక్క సిక్స్ కూడా కొట్టలేక చతకల పడిపోయిందని, కనీస అవగాహన లేని పవన్ కళ్యాణ్ కు తెలియకపోగా నా ఎంతో అనుభవం కలిగిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాడు తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మళ్లీ జగనన్న కోసమే ఎదురుచూస్తున్నారు అంటూ వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. వివాహ వేడుకల కార్యక్రమంలో దక్షిణ వైసిపి కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కళాశాలల సిబ్బంది, మహిళా నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని దంపతులిద్దరకు శుభాకాంక్షలు తెలియజేశారు.
What's Your Reaction?