పరవాడ ఎంపీడీవో సస్పెన్షన్‌

పరవాడ: మద్యం తాగి అధికారిక సమావేశానికి హాజరైన పరవాడ ఎంపీడీవో ఎస్‌.డి.శ్యామ్‌సుందర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్‌ బుధవారం మధ్యాహ్నం జిల్లాలోని ఎంపీడీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు పరవాడ ఎంపీడీవో ఆలస్యంగా హాజరయ్యారు. వివిధ అంశాలపై కలెక్టర్‌ ప్రశ్నించినపుడు తడబడుతూ పొంతన లేని సమాధానాలిచ్చారు. ఆయన వ్యవహారశైలిపై కలెక్టర్‌ అనుమానించి సమావేశం జరుగుతుండగానే విచారణకు ఆదేశించారు. ఆ మేరకు డీఎంహెచ్‌వో రవికుమార్‌ హుటాహుటిన స్థానిక వైద్య సిబ్బందితో పరవాడ మండల పరిషత్తు కార్యాలయానికి చేరుకుని ఎంపీడీవో నుంచి రక్త నమూనాలు సేకరించారు.

పరవాడ ఎంపీడీవో సస్పెన్షన్‌

అనంతరం జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో రాజకుమార్, ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌ తదితరులు కూడా ఇక్కడికొచ్చి వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఎంపీడీవో మద్యం తాగి విధులకు హాజరవ్వడమే కాక దురుసుగా ప్రవర్తిస్తుంటారని ఆ విచారణలో తేలింది. ఆ మేరకు వారు నివేదిక అందించడంతో ఎంపీడీవో శ్యామ్‌సుందర్‌ను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. ఆ స్థానంలో ఈవోపీఆర్డీ ధర్మారావుకు ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. శ్యామ్‌సుందర్‌ నాలుగు నెలల క్రితమే ఇక్కడకు బదిలీపై వచ్చిన సంగతి గమనార్హం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow